Saturday, November 20, 2010



నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.

కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.

రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.

విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,

ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా

పుడమిని తడిపే స్వాతిచినుకు ఆనందమే,
చెలియ చూపుతో గుండెవణుకు ఆనందమే.

చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.

తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.

కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.

సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.

కనుచూపుకు కరువైనా, కనుపాపవు నీవేగా!! కనుపాపలో నీవున్నా, తుది గమ్యం మనసేగా!! ఇది పలికింది పెదవైనా, తెలిపింది మనసేగా!! ఆ మనసులే మౌనంగున్నా, ప్రేమ పెదవంచునేగా!! ఆ ప్రేమ నీవైన సమయానా, ప్రతిక్షణం నీ నీడేగా,తుదిశ్వాసలో నీ తోడేగా!!

నింగిలోని జాబిలై నీకందనని నవ్వుతుంటే, నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా. అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే, గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా. మనసు నిండ ప్రేమనుంచుకోని కురిపించలేని మేఘంలా నీవుంటే, నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా. సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా, నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా. ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం జ్ఞాపకలై నన్ను ఏడిపిస్తున్నా ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా.

నీకై వేచిచూసి విసిగిపోయిన నాలో....

"మదికి, బుద్దికి మద్య విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.

జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.

ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు.

నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నవ్వై అమ్మానాన్నలు."

నీవిక చేరువ కావు,నవ్విక దూరం కాదు.
దక్కలేదని దుఖ్ఖం చెందను,అందలేదని అంతంచూడను.

వర్షపు ఓడిలో,చినుకుల తడిలో,
ఒకటై నడుస్తూ,జతగా తడుస్తూ..

కదిలే గాజుల సవ్వడిలో,రాలే జాజుల ఒరవడిలో.
నా నడక తడబడితే,నువ్వు కనబడక మాయమైతే,

నీవు కానరాక నా కంటతడి,
అల్లంత దూరాన నా కంటపడి.

వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు

నీ చెంత చేరాకా,నా చింత తీరాక.
చినుకులన్నిటిని స్వాగతిస్తూ,నీ చేతికి కానుకిస్తూ.

నీ తోడులో.... వర్షం కురుస్తూ,కాలం కరుగుతూ,
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
(or)
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ కౌగిలిలో కరిగిపోతు నేను....

Tuesday, November 16, 2010


నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...
నువ్వు నేనై పోతావు ..

నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే
నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.

నీకెంత దూరమైనా..
నిను చూడక పోయినా..
నాకోసం అలానే..
ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావు
నీగుండె పగిలినా.. నిశ్చలంగా..
నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావు

ఎద్దేవా చెయ్యకుండా..
నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..
నన్ను మెరుగు చేయాలన్న తపన నీది
అది ఒకటే తపస్సు నీకు
మళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవు
ఏమనుకుంటానో అనీ చూడవు.
ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?
ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?

కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా.. రాకపోయినా..
నీ దరి చేరినా.. చేరక పోయినా..
అలా నాకోసం ఎదురు చుస్తూ..

ఎందుకు ?
నీకంటూ ఏ ఆశలుండవా ?
నీ బ్రతుకు నీకు లేదా ?
నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?

ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..
నిర్మలంగా.. నాకోసం..
నేను నీకేమి చేశానని ?
ఎలా ? ఎందుకు ?..

నా గుండె కరిగిపోతోంది..
మనసు అట్టుడికిపోతోంది..
నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?

నీకేమి చెయ్యగలను ?
అద్దమయిపోయావు ... అమ్మాయివైతే
అర్ధాంగివయ్యేదానివి.

బద్దలయితే ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది...

ముందుకొచ్చిన మౌనంతో
కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది...

స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే
ఎందుకో సుఖమనిపిస్తుంది..

సడిచేసే గుండెలో జీవంలేక
ఏ నవ్వు వెనకా మమత లేక
ఆశా సౌధాలుజేరే సోపానాలు లేక
అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి
కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది.

ఇది నిజం..
ఆ వేదన ఏరులై పారనీ.. ఆ ప్రవాహమాపకు ...

ఆ తరవాత అంతా
మరో ఉదయంలా ప్రశాంతంగా అనిపిస్తుంది
పారే సెలయేరులా నిర్మలంగా కనిపిస్తుంది..
ప్రతినవ్వులో పసి పాప కనిపిస్తుంది
గుండె లయల్లో సరిగమ వినిపిస్తుంది.
బ్రతుకు తిరిగి మధురంగా అనిపిస్తుంది.

పడటం తేలిక.. పడి ఉండడం మరణం..
లేచినప్పుడే విజయం వరిస్తుది..
మరో బ్రతుకు చిగురిస్తుంది !!

కళ్ళు


ప్రయత్నించినా పెగలని పెదవులు
ఎదో అనుబంధంలా బిగుసుకుంటాయి..

దొర్లని పదాలు.. దొరకని బాసలు
చిక్కని మబ్బుల్లా.. జారుకుంటాయి...

అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
సౌరభాలతో స్థిమితాన్ని చెదర గొడతాయి..

అందుకే
గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే

ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ కవనం..
నా కళ్ళలోకి చూస్తావు కదూ.. ?

తనెళ్ళిపోయింది..


తనెళ్ళిపోయింది..

ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..

కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..

అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..



ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…

పొద్దులో ప్రచురించబడిన మూగ ప్రేమ

దాటదు కన్నీరు


దాటదు కన్నీరు నా కన్నుల ద్వారం
చూస్తూ అనునిత్యం నా కన్నుల నీ రూపం
ఆగదు ఓ క్షణం నీ జతలో సాగే నా పాదం
వింటూ ప్రతిక్షణం నీ అందెలసవ్వడి రాగం
కోరదు నా మది నూరేళ్ళ జీవితం
నవ్వుతూ ఓ శరం విసిరితే నీ అదరచాపం
ఆపదు నా హృదయకెరటం లాగుతున్నా ఆ మృత్యుగర్భం
లాలిస్తూ ఓ అరక్షణం నన్ను పెనవేస్తే నీ కౌగిలితీరం
సాగదు నిన్ను విడి నా ఉహలపయనం
విహరిస్తూ నీ తలపుల దారులలో మరిచింది ఈ లోకం
అడగదు ఏ వరం ఆ దైవాన్ని నా ప్రాణం
గడుపుతూ నీ జతలో ముగిసిపోతుంటే నా ప్రతి జన్మం

నేనోడిపోయాను..


తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
కాంతి తీగలూ వంచలేను..
తడి కంటి కాంతి ఇప్పటికే
అపభ్రంశమయ్యింది.

నావి కాని గాయాలకి
మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన పాదాల క్రింద
విధి అరిగిపోయింది.

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
యాతమేదైనా తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
ఇకనైనా నా తోడు కావాలి.

నేనోడిపోయాను..నీ జోడు కావాలి.

పిలిచి పిలిచి నాలుక పిడచకడుతున్నా..
ఎదురు చూసిచూసి కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం ఏ గుండె గంటలు చేరదు !!

మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.

ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడమే
నాకిష్టం..
మొండి ప్రేమలో..
దీపపు పురుగును కాలేను..

నువ్వు మనలేకనే.. మనగలవా అన్న ఆ ప్రశ్న..
మరో సారి నిన్ను నువ్వు చూసుకో..
ప్రణయమని కరుగుతావో.. ప్రక్షాళితమవుతావో.

మనసు కొండ మీది మందారాన్ని
పూజ వస్తువుగానే పొదువుకున్నాను..
నిరీక్షణలో కరిగిపోయిన కాలాన్ని
నీరాజనంగానే అద్దుకున్నాను...

నిన్ను కోరిన మనసు మధనను
ప్రసాదమంటూ సమాధానపడ్డాను..
తపన మిగిలిన తడికన్నులను
నిర్మాల్యమని తృప్తిపడ్డాను..

మాటల గారడీలో
పెదవుల వెనక నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన రెప్ప చూరుల
వెంట ఆవిరయిన ఆశ క్షణాలనూ..
గోటి మొనతో మీటి..

గుండె గుడిలో వెలిసిన దేవతకు
మంగళహారతి అనుకున్నాను.

ఆ కళ్ళలోకి చూసినప్పుడల్లా..
ఓ వింత అనుభూతి..
ఈ తరుణం జీవితాంతం
నిలిచి పోగలదన్న ఆశ

మరో అనుభవం ఏదీ
దీనికి సరిరాదు. అసలు
అటువంటిది మరొకటి
ఉండదేమో ...

నువ్వు నాకు తెలుసన్న
పరిధిలోనే.. ఈ ఆనందమంతా..
ఐనా అదిచాలు.. అంతకన్నా
అడిగేదేమీలేదు.. అడగలేను.

గుండెనోడిపోయిన మనిషిని
అందులో నువ్వు నిండి ఉన్నావని
ఎలా చెప్పేది ? మన గలనన్న
మాటనెలా ఇచ్చేది ?

ఎన్నాళ్ళగానో
నన్ననుసరించిన నా నీడ ...
తనకూ రంగులు కావాలనడిగింది.

కలన తప్ప రంగెరుగని నేను,
కన్న ప్రతికలనుండీ,
తను కోరిన రంగులు
రంగరిస్తూ వచ్చాను..

చాలలేదనుకుంటాను..
వెలుగు కలిసిన ప్రతి క్షణం..
అర్ధిస్తూ నిలబడుతుంది.

విధిలేక కలలూ..
నా రెప్పలు చీల్చుకుని
కాంతి తీగెలు వెదుక్కుంటున్నాయి.

వివర్ణ ప్రవాహంలో
ఎదురీదుతూ..
అలసిన గురివింద కళ్ళు..
తమ ఎరుపు మరిచి నట్టున్నాయి.

అప్పటిదాకా ఎక్కడున్నాయో
నువ్వు మలుపు తిరిగేసరికి
ఊడిపడ్డాయి.. వెచ్చగా..
-*-

చూసినంత సేపూ రాని నువ్వు
అటు తిరిగేసరికి ప్రత్యక్షం..
తెలిస్తే ఎప్పుడో తిరిగే వాడిని.
-*-

కిటికీ లోనుంచి నీకోసం చూస్తూ
అందరూ నీలానే కనిపిస్తారు
దగ్గరకొచ్చేదాకా..
-*-

ఆరుబయట నేను..
గోడమీద కాలానికి
కీ ఇవ్వడం మరిచానేమో..
-*-

ఎంత చూసినా...
అక్కడి వరకే.. ఈ చూపులు..
మలుపు తిరిగితే బాగుణ్ణు.
-*-

ప్రతి శబ్దంలో
అడుగుల అలికిడి వెదకలేక
చెవులూ అలుస్తున్నాయి..
-*-

చెవులకి చేరిన చేతి డొప్ప..
శ్వాసనాపి ..ఆకుల అలజడిని
ఆపోశన పడుతోంది.

అసంకల్పితంగానే ఎంత మారాను ?
అయిష్టంగానే ఎన్ని కోల్పోయాను !!

ఆ లేత చేతులూ, నిర్మల హృదయం..
అమాయకత్వం.. ఏవీ ?

ఒద్దనుకున్న సంగమానికి
ఏమిటీ ఒరవడి ? ఎందుకీ పరుగు ?

ఆశల పగ్గాలకి చిక్కిన..
అసంతృప్తి బ్రతుకు పయనం.. ఎవరికోసం ?

ఈ ప్రస్తుతమొద్దు..
చూడని భవిష్యత్‌ వసంతాలసలొద్దు..
గతించిన గతంలోకి పున:ప్రవేశమిక వద్దు..

జనసముద్రంలో నాకై తపనతో విదికే
ఓ రెండు కళ్ళకోసం నేవేచిన
నా పసితనం చాలు..

నాకింకేమీ వద్దు !!

అనుభవాల శిధిలాలనూ,
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..
అనుబంధాలు అణచి మొలిచిన
వృక్షాల మధ్యగా..

ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?

ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం !

ఈ సాగర సరంగు దాహమెప్పటిదో!
తీరమెప్పటికో !!?

గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..

మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..

జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..

తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..

ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..

బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.

నీతోడు పొందాలనుంది.


బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...

కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...

మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..

తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..

పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..

అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?

,,,ఆప్యాయతను చవి చూసిన,,

నన్ను
ఆలనగా అక్కున్న చేర్చుకో
ఆలంబనగా హక్కున్న దానిగా పాలించుకో
పరిపలించుకో నా హృదయ సామ్రాజ్యాన్ని
పెదవి పెదవితో చుంబనంగ అందుకుందాము ఈ అంబరాన్ని
మలుపు మలుపుకు మదనలోకాన్ని మైమరిస్తూ
పరవశంతో వురేగుదాము శృంగార పల్లకిలో ...........................

మౌన వీణ పలికిన ఓ జాన అందుకోనా నే అందుకోనా

నీతో నా జీవితాన విరబూసేనా మల్లెలవాన

వెలిసేన నీ ప్రేమ గాన మురళిన నీవు పలికిన ప్రేమ స్వరాన

అంది అందని నీ అందెల సవ్వడిన నాట్యము చేసేనా నా యదన
నీ పాదాన పదము కలిపిన నా సంగీత సాధన

అది కావాలి మన ప్రేమకు వంతెన

మానసము చెయ్యనా నే సొగసున

మది వికాసము అయ్యేనా నా వలపున

ఇంతే నా జీవనాన సుఖమైన , దుఖమైన నీతో నా జీవితాన



ఎవరు నువ్వు ....
నీ నవ్వులను చూసి
చిట్టి చేమంతులకు శ్రీమంతం జరుగుతున్నదా అనుకున్నా
అర కన్నుల వెన్నెల చూపులో కోటి వెలుగులు విరుస్తున్నాయి లే అని నివ్వేరబోతున్న
కైపుగా వుండే నీ మాటలే వాకిట్లో ముత్యాలుగా తోలి ముగ్గుగా మురిపిస్తున్నయిలే అని మురిసిపోతున్న
ఇంకా నాకు నువ్వు ఎవ్వరో అర్థం కావట్లేదు
చాటు మాటు గారం కనులనే కలిపితే బాగుండు అపుడు నా హృది చపుడు
నీ పెదవిని వనికిస్తుందేమో కదా ............
ఇంతకీ నువ్వు కునుకులమ్మకు కూతురివా
లేకపోతె మెరుపులమ్మకు మేనకోడలివా

నా కన్నుల వెన్నెల లోన

నీ మనసే

సిరిబోమ్మల పల్లకిలో వధువుగా రావాలి

సిరిమోగ్గల మధువుల సిగ్గుతో ........

నా ప్రణయ ప్రలయంలోన

నీ వయసే

నవకమలంపై పరవశంతో నీటి బిందువుగా కావాలి

మధుకలశంపై విరబూసిన పుష్ప సిందువుతో.....

నేను ఏమి చేసిన అది నీ ప్రేమ పొందటానికే

కన్నులు కాంచిన నీ ఆకాంక్ష సంద్రం లో జలకాలాడి

నీ మది గుడిలో నా ప్రేమ శిల్పాన్ని ప్రతిష్టించి

ఆనందాశ్రువుల అభిషేకాన్ని నీకు అర్పించి

ఇదంతా ఓ మధుర కావ్యంలా రచించి
నీకు నింగి లోని నక్షత్రాలను తలపించే తలంబ్రాలను వెస్తూ
వుంటే ఆ తలంబ్రాల ప్రతి ముత్యం నీ మేనుని తడుముతూ
ఆ మధుర రచనను రంగీకరిస్తూ రమరింపజేస్తూ
గుర్తు చెస్తూ వుంటుంది ,,,,,ఏమంటావు .....మరి

కవ్వించే కనులకు కమల సహిత పుష్ప బిందువైనావు

నీవు ధరించే సిందురంలో ఈ సూరీడి ప్రేమను మిళితం చేసినావు

ఏడేడు జన్మల కు సరిపడే ప్రేమను ఈ జీవన మజిలీలో నే

మరపు రాని మమతలుగా అందించినావు

ప్రతి మలుపు మలుపు కి మాసిపోని మానసిక ఆనందాన్ని అందిస్తూనే

ప్రతిధ్వనిగా మహోత్తమైన శృంగార రసకేలిలో వూయలుగించావు //////

నిన్నే స్మరిస్తూ ,,,సద నిన్నే తలుస్తూ ,,,,నీ వొడిలోనే పవలిస్తూ ,,,,,నీ ,,,,ప్రాణం....నిన్ను గుర్తు చేసుకుంటుంది
కవ్వించిన ఆ కన్నులతోనే కడకు నా కన్నులలో కన్నీళ్లను కూడా హరింపజేసి
ఖాళీ కట్టెను మిగిల్చి నాకు దూరంగా కనుమరుగయ్యావు ,,,,,........
ఇది నేకు న్యాయమా ,,ఆ దేవునికి ధర్మమా ?
మా ప్రేమను చూసి విధికి వశం కాలేదేమో ,,,నా పరవశాన్ని తీసుకుంది
కానీ నా ప్రేమను తీసుకోలేదు ,,,దానికి అంత ధైర్యం లేదు .....
నాకు ఇంకా భరించే శక్తి లేదు ,,,,
అందుకే నేను విధి వన్చికున్నికాదు ....వీధిన పడ్డ చెత్త కాగితాన్ని కాదు ,,,
ఒక ప్రేమికున్ని ,,,కేవలం ప్రేమకే దాసున్ని

ప్రతి సూర్యోదయం ఒక్క పలకరింపు ,
ప్రతి అనుభవం గెలుపు తోలి మెట్టు,
కొన్ని కొన్ని జ్ఞాపకాలే తీపి గుర్తులు,
అందులోని మన స్నేహం అందమైన హరివిల్లు

ప్రియతమ,
నిన్ను తొలిసారి చూసిన క్షణాన, నువ్వే నా మది లయలో చిత్రించుకున్న నా,

మనసు రూపం ల అనిపించి మురిపించి నా, సుందర పుష్పం నివ్వే నా ప్రాణమా


ఓ సాయంత్ర వేళ్ళ ,
తొలకరి జల్లు కురిసిన సమయాన ,
అలంత దూరాన పచ్చని పంట పొలాలను
మంచు పొరలు కమ్ముకునే అ దృశ్యం
చూసి మనసు పాడే మౌనరాగం ఎంత మధురం

నీ అద్దరాల నుంచి జాలువారు చిరునవ్వు కోసం వేతికేకళ్ళు ,
నీతో ఎన్నో ఉసులు చెప్పాలని ఆరాటపడే పేదలు ,
నీ స్పర్శ కోసం ఎదురు చూసే మేను,
నీ పలకరింపుతో పావనమ్వాలని కోరుకునే చెవులు

నేస్తమా,
సూర్యుని వెచ్చదనానికి విరిసిన కమలం వంటి నీ నవ్వు,
పౌర్ణమిలో చందమామ వంటి నీ మోము,
మల్లె కన్నా అందమైననీ మనసు ,
సాహిత్యంలోని మధురమైన సంగీతం నీ స్నేహం .

నీలి మబ్బుల ఆకాశం
సరి సాయంత్ర సమయాన అట్టు ఇట్టు చెట్టు ,
నడుమ వెళ్తునపుడు చీకటి పడ్డుతునట్టు ,
ఉన్నపుడు చినుకుల తో తడిపి వానల విస్తరించి ,
తడవాలనే మనసును ఊరిస్తూ సాగే ప్రయాణం మరువతరమా

ప్రియ ,
నా గుండె చప్పుడుకి అర్ధం నువ్వు ,
నా మౌనం లోని సంగీతం నువ్వు ,
నా ఆశ కు ఉపిరి నువ్వు ,
పడి లేచే కెరటాల నా మనసుకు ఓదార్పు నువ్వు ,
నా జీవితం లో నువ్వు ఎంత ముఖ్యం అంటే
నా లో శ్వాస వై నన్ను నడిపించే ప్రాణానివి నువ్వు

దేవున్ని ఆరాదించే భక్తుడు,
అనుభందం లోని ఆప్యాయత,

స్నేహం లోని అనురాగం,
మన ప్రేమ లోని తీపి గుర్తులు

సిరి మువ్వ ,
చిరు జల్లు ,
నింగి హరివిల్లు ,
పరిమలించే పుష్పo
నీ నవ్వు,

గల గల పారే సెలయేరు వంటి నీ నవ్వు,
చిరునవ్వు తో పలకరించే నీ స్నేహం ,
నీ మాటలతో నవ్వుల జల్లు కురిపించావు మా తో
చేసిన చీలిపి అల్లరుల జ్ఞాపకాలను మరువ తరమ .
చిరునవ్వుల ధరహసమ ,
నువ్వు అదరాల పై సందడి చేసే వేళ్ళ ,
మనసు లోని ఆనందం కనుపాపల వెలుగు లో కనిపిస్తూ,
చూసే కన్నులను ఆకర్షిస్తూ చిరునవ్వుల సమాదానం చెప్పాలనిపిస్తుంది

చిరుజలల్లుల చిరునవ్వులతో నన్ను తడిపేస్తున్నావు

చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్ఛేస్తున్నావు,

కొకిల స్వరంతో మైమరపిస్తున్నావు,

తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు,

మరి ప్రేమిస్తునానంటే వద్దని ఎందుకు వేధిస్తునావు,

ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది,

మనిషివి దగ్గరగా ఉండి మరి మనసుకి దూరాన్ని పెంచుతున్నావే,

ఎలా నీకు నా ప్రేమను వ్యక్తం చెయ్యగలను?

రవిని కాను కిరణమై నీ మనసులో ప్రవేశించటానికి,

కవిని కాను కవితనై నీ మదిలో నిలిచిపొవటానికి,

ప్రాణం కూడ తృణమే నువ్వు లేనప్పుడు

మరణం కూడా ఆభరణమే నువ్వు ప్రేమిస్తానన్నప్పుడు.


చెప్పకొటానికేముందని చెప్పమంటారు నా గురించి,

అచ్ఛమైన తెలుగువాడిని,

కాలేజీలో చదవే స్తోమతలేక జీవితాన్ని చదువుతున్న విధ్యార్దిని,

కాలే కడుపుకోసం పని చేస్తున్న కార్మికుడిని,

ఏన్నో చెయ్యలనుకుని ఏమిచెయ్యలేని ఆశాపరుడిని,

నమ్మకాన్ని మాత్రమే పంచగల ఆత్మీయుడిని,

తల్లిదండ్రులని సంతోషపరచలేని తనయుడిని,

ప్రేమకొసం బయలుజేరిని బాటసారిని,

అందరూ నాతో స్నేహం చెయ్యలనుకునే స్వార్దపరుడిని,

ఆకలి మంటలు తీర్చాలనున్న తీర్చలేని దరిధ్రుడిని,

ఏమి లేకపొయినా సంస్కారం మాత్రం తెలిసిని భారతీయుడిని.

గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,

నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,

ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,

నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,

నీ అంగీకారం దొరకక,

పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.

బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,

సరస్వతీ పుత్రికవైన నీకు,

నా చూపుల భాష తెలియటం లేదా?

లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా?

నువ్వు దూరమవుతుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి,

కాని నాకు దూరమవుతున్న నీ కళ్ళలో కన్నీరు చూసినప్పుడు,

నాకోసం బాధపడే ఒక మనసుందని తెలిసినప్పుడు,

ఎలా నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యగలను,

నీ బాధలో నా మీద ప్రేమను చూసుకున్నాను,

చాలు నాకోసం నువ్వు జార్చిన ఒక్క కన్నీటిబొట్టు చాలు,

ఇంక నా ప్రేమను నీ కన్నీటి నుండి బయటకి రానివ్వను.

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,

నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,

దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,

నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,

నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,

నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,

నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,

నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,

అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,

కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.

అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

జతచేరిన బంధమేదో జీవితమయ్యింది,

మనసులొని ప్రేమను పంచే తరుణమయ్యింది,

నీ చూపుల ప్రేమాభావం నా మనసుని తాకింది,

నా మనసులోని ప్రేమజ్యొతి నీగుండెలో ఐక్యమయ్యింది.

పల్లవినై నీ పాటకి ప్రాణమవుదామనుకున్నాను,

కాని నీ ప్రేమతో నా మాటలు మూగబొయి మౌనరాగంగా మిగిలిపొయాను.

ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,

క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి,

కాని జీవితం కూడా సరిపోదు నా వేదన వ్యక్తం చెయ్యటానికి,

యుగము కూడా సరిపోదు నా ప్రేమను నీకు పంచటానికి.


అలుపురాని కెరటాంలా నీ మనసు తీరం చేరటానికి ప్రయత్నిస్తున్నాను,

గెలుపుకోసం పోరాడే ప్రత్యర్దిలా నీ ప్రేమను గెలుచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను,

నీ తలపులు తీరం చేరలేదన్న బాధను తగ్గిస్తున్నాయి,

నీ చూపులు ఏ రొజుకన్నా గెలుస్తానన్న నమ్మకాన్ని ఇస్తున్నాయి.


తడిచే వృక్షానికి తెలియదు ఆ వర్షానికి కారణం తానేనని,

ఆహ్లాదించే నీ మనసుకి తెలియదు ఆ ప్రేమకు కారణం నేనేనని.

మౌనమనే అస్త్రంతో నా మనసుకి గుచ్ఛావు,

ప్రేమలేని ఎడారిలో నన్ను వదిలేశావు,

నా ప్రేమదాహం ఎలాగు తీర్చలేవు,

కనీసం నీ చిరునవ్వుల ఒయసిస్సులన్నా అప్పుడప్పుడు పంచు,ఆనందంగా బ్రతికేస్తాను.

మనసుకి మంత్రం వేసి నన్ను నీవాడిని చేసుకున్నావు,

ప్రేమను ప్రాణంగా పోసి నన్ను బ్రతికిస్తున్నావు,

నీ రాకతో నా జీవితానికి వసంతం వచ్చిందనుకున్నా,

అనురాగాలు పంచే అర్దాంగి అవుతానన్నావు,

కాని ఒంటరితనం అనే అగాతంలొకి తోసేసి మాయమయ్యావు,

నన్ను ఒంటరిని చేసి నువ్వు ఇంకోకరి జంట అయ్యావు,

నా మనసుని చంపి నీ ప్రేమను ఇంకోకరికి పంచటానికి సిద్దమయ్యావు,

తనతో నడిచిన ఏడడుగులుతో నాకు జీవితమంతం దొరకనంత దూరం వెళ్ళిపొయావు.

నాకు వేదన మిగిల్చి తనకు ఆనందాన్ని పంచుతున్నావు.

నువ్వు మనుషుల మనసుతో వ్యభిచారం చేస్తున్నావు.

నన్ను అభాగ్యుడిగా వదిలేసి తనకు అర్ధాంగి అయ్యావు.

నేను నీకు ఎంత చేరువలో ఉంటానంటే,

జారే కన్నీటిబొట్టును తుడిచేటంత చేరువలో,

నా గుండె చప్పుడు నీకు వినబడేంత చేరువలో,

నా ప్రతిబింబం నీ కంటిపాపలో కనబడేటంత చేరువలో,

నా ప్రతిమాటా నీ మనసుకి చేరేంత చేరువలో,

నీ నీడతో కలిసి నా నీడ నడిచేటంత చేరువలో,

నీకు తోడుగా నీ చెయ్యి పట్టూకోని నడిచేటంత చేరువలో.